Manidweepa Varnana Lyrics in Telugu మణిద్వీప వర్ణన

Manidweepa Varnana Lyrics in Telugu

మీరు ఎప్పుడైనా నిజమైన శాంతి, ఆనందం, భక్తి కలగలసిన అనుభూతిని కోరుకుంటున్నారా? అప్పుడు “Manidweepa Varnana Lyrics in Telugu” మీకోసం ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మనిద్వీపం అంటే అమ్మ లలితా దేవి కొలువై ఉన్న దివ్యమైన స్థలం.

ఈ స్తోత్రం చదివితే మనసులో ప్రశాంతత, జీవితంలో ఆనందం కలుగుతుంది. మనకు ఎంతో దగ్గరైన అమ్మవారిని ఈ పదాలతో ప్రార్థిస్తూ మనసుకు ఆహ్లాదం, భక్తితో కూడిన అనుభూతిని కలిగించుకోండి.

మణిద్వీప వర్ణన (Manidweepa Varnana Lyrics in Telugu)

మహాశక్తి మణిద్వీప నివాసినీ
ముల్లోకాలకు మూలప్రకాశినీ ।
మణిద్వీపములో మంత్రరూపిణీ
మన మనసులలో కొలువైయుంది ॥ 1 ॥

సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణ పూలు ।
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥

లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్సంపదలు ।
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 3 ॥

పారిజాతవన సౌగంధాలు
సూరాధినాధుల సత్సంగాలు ।
గంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 4 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవున గలవు ।
మధుర మధురమగు చందనసుధలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 5 ॥

అరువది నాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు ।
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 6 ॥

అష్టసిద్ధులు నవనవనిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు ।
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 7 ॥

కోటిసూర్యుల ప్రచండ కాంతులు
కోటిచంద్రుల చల్లని వెలుగులు ।
కోటితారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 8 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

Also Read this: Ashta Lakshmi Stotram Telugu – అష్టలక్ష్మీ స్తోత్రం

కంచు గోడల ప్రాకారాలు
రాగి గోడల చతురస్రాలు ।
ఏడామడల రత్నరాశులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 9 ॥

పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు ।
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 10 ॥

ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు ।
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 11 ॥

సప్తకోటిఘన మంత్రవిద్యలు
సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు ।
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 12 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

మిలమిలలాడే ముత్యపు రాశులు
తళతళలాడే చంద్రకాంతములు ।
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 13 ॥

కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాల నొసగే అగ్నివాయువులు ।
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ॥ 14 ॥

భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచభూతములు పంచశక్తులు ।
సప్తృషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 15 ॥

కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు ।
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 16 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

Also Read this: Surya Ashtakam Telugu

తెలుగులో మణిద్వీప వర్ణన సాహిత్యం

మంత్రిణి దండిని శక్తిసేనలు
కాళి కరాళీ సేనాపతులు ।
ముప్పదిరెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 17 ॥

సువర్ణ రజిత సుందరగిరులు
అనంగదేవి పరిచారికలు ।
గోమేధికమణి నిర్మితగుహలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 18 ॥

సప్తసముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు ।
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ॥ 19 ॥

మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు ।
సృష్టి స్థితి లయ కారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 20 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు ।
పదారురేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 21 ॥

దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు ।
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 22 ॥

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు ।
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 23 ॥

పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు ।
సంతానవృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 24 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రపురాశులు ।
వసంతవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 25 ॥

దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు ।
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 26 ॥

పదునాలుగు లోకాలన్నిటి పైన
సర్వలోకమను లోకము కలదు ।
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానమ్ ॥ 27 ॥

చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైన ।
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో ॥ 28 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

Also Read this: Sri Subrahmanya Ashtakam Telugu

మణిగణఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరిదాల్చి ।
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో ॥ 29 ॥

పరదేవతను నిత్యముకొలచి
మనసర్పించి అర్చించినచో ।
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ॥ 30 ॥

నూతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు ।
చదివిన చాలు అంతా శుభమే
అష్టసంపదల తులతూగేరు ॥ 31 ॥

శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట ।
తిష్టవేసుకుని కూర్చొనునంట
కోటిశుభాలను సమకూర్చుటకై ॥ 32 ॥

భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥

మనిద్వీప వర్ణన చదివిన తరువాత మన హృదయంలో నిజమైన భక్తి భావన పుష్కలంగా విస్తరిస్తుంది. అమ్మ లలితాదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.

మీరు కూడా ఈ స్తోత్రాన్ని మీ మిత్రులు, బంధువులతో పంచుకోండి, వారి జీవితాల్లోనూ దివ్యమైన అనుభూతులు నింపండి. మీ అనుభవాలను కామెంట్లలో పంచుకోవడం మర్చిపోకండి. జై లలితా దేవి!

Also Read this: Hanuman Chalisa Telugu

Scroll to Top